వినుకొండ: పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ విస్తరణ అధికారుల సంఘం నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొని, సంఘం భవిష్యత్ కార్యక్రమాలు, రైతులకు అందించాల్సిన సేవలు, శాఖ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షుడిగా నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్న బ్రహ్మయ్యను, ప్రధాన కార్యదర్శిగా ఈపూరు మండలంలో పనిచేస్తున్న ఏఈఓ సునీతను ఎన్నుకున్నారు. అశోసియేట్ అధ్యక్షుడిగా వినుకొండకు చెందిన ఏఈఓ అరిఫ్ను, కోశాధికారిగా బొల్లాపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న మల్లికార్జునను సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇతర కార్యవర్గ సభ్యులను కూడా ఇదే విధంగా ఎన్నుకున్నారు.ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు వినుకొండలో వ్యవసాయ శాఖ ఏడీఏ రవి కుమార్ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏడీఏ నూతన కమిటీకి అభినందనలు తెలియజేసి, రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేలా సంఘం చురుకుగా పనిచేయాలని సూచించారు. సంఘం తరఫున సభ్యులు కూడా రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల అమలులో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.







