
బొగ్గరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామస్థులు నిరాకరించారు. గ్రామ సచివాలయ సేవలను బొగ్గరంలోనే అందించాలని డిమాండ్ చేస్తూ సామూహిక నిరసన చేపట్టారు.
గ్రామస్థుల వివరాల ప్రకారం, ప్రస్తుతం పెదకొండాయపాలెం కేంద్రంగా సచివాలయ సేవలు అందుతున్నాయి. అయితే బొగ్గరంలో సుమారు 3 వేల జనాభా ఉండటంతో తమ గ్రామంలోనే సేవలు అందించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి చేశారు.
ఈ సమస్యను ఎంపీ లావు వీరితోపాటుగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లగా, ప్రజల కోరిక మేరకు వారంలో మూడు రోజులు బొగ్గరంలో, మరో మూడు రోజులు పెదకొండాయపాలెంలో సచివాలయ సేవలు అందించేందుకు అంగీకరించారు.

అయితే రెండు రోజుల క్రితం సచివాలయ సిబ్బంది బొగ్గరానికి వెళ్లకుండా అడ్డుకున్న ఘటన చోటుచేసుకుంది. పెదకొండాయపాలెం గ్రామస్థులు సిబ్బంది తమ గ్రామంలోనే ఉండాలని పట్టుబట్టినట్లు సమాచారం.
దీంతో పెదకొండాయపాలెం నాయకుల తీరును నిరసిస్తూ బొగ్గరంలో ప్రజలు ఇవాళ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా నిరాకరించారు.
బొగ్గరంలో కనీసం మూడు రోజుల పాటు సచివాలయ సేవలు అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నా
రు.








