
నూజెండ్ల: “తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు నీరు ఎంత విలువైనదో మనందరికీ తెలుసని, ప్రతి నీటి బొట్టును భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని” వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ అన్నారు. నూజెండ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మీసాల మురళి కృష్ణ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘జలధార’ 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాగునీటి అవసరాలు సాగునీటి అవసరాలకు జలమే జీవనాధారం అని…ఎక్కడ జలాలు సమృద్ధిగా లభిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు నియోజకవర్గవ్యాప్తంగా చెరువులు, కుంటలను అభివృద్ధి చేస్తూ భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నీటి బొట్టును వృధా చేయకుండా ‘జలధార’ కార్యక్రమం ద్వారా నిల్వ చేసేలా ప్రణాళికలు రూపొందించిందని, ఈ విషయంలో మండల ప్రజలంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, జడ్పిటిసి సుబ్బులు రామయ్య ఎంపీపీ జయరామిరెడ్డి,గుంటూరు జిల్లా మాజీ పశుగణ అభివృద్ధి చైర్మన్ లగడపాటి వెంకట్రావు,నూజెండ్ల సొసైటీ అధ్యక్షులు బచ్చు అంజిరెడ్డి మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






