
వినుకొండ శ్రీనివాసనగర్‌లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాఘమాస పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సహకారంతో ఉచిత సామూహిక వ్రతమహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.ఆలయ అర్చకుడు శ్రవణ్ పర్యవేక్షణలో, పురోహితుడు వడ్డేంగుంట శేఖర్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో 60కు పైగా జంటలు పాల్గొన్నారు. వేదమంత్రోచ్చారణలు, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. మంగళ వాయిద్యాల మధ్య వ్రతాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అందించారు.అర్చకుడు శ్రవణ్ మాట్లాడుతూ మాఘమాసంలో ఈ వ్రతం ఆచరించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు భాగవతుల రవికుమార్ మాట్లాడుతూ పూర్వీకులు, ఋషులు ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలను కొనసాగించడం అవసరమని, పరిషత్ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు, భక్తులకు గజవల్లి నాగ పవన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రెడ్డి బంగారయ్య, కాళ్ల కోటేశ్వరరావు, గుడిపాటి కోటేశ్వరరావు, వాసు, పరిషత్ సభ్యులు గోనుగుంట్ల ఘంటారావు, వీరభద్రాచారి, భవనాసి సాంబశివరావు, కొలిశెట్టి సుబ్బారావు, అనసూర్యతో పాటు పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.








