
వినుకొండ: ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు శనివారం అనాధ శవాలకు అంతక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఫౌండేషన్ నాయకులు పి.వి. సురేష్ బాబు, పువ్వాడ కృష్ణ మాట్లాడుతూ వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులోని కాశీనాయన ఆశ్రమం సమీపంలో, అలాగే వినుకొండ రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు.రైల్వే పోలీసులు మరియు వినుకొండ పట్టణ పోలీసులు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో ఉంచి, మృతుల ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.ఈ విషయం తెలుసుకున్న ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పోలీసుల అనుమతితో మృతదేహాలను స్వయంగా స్మశానానికి తరలించి అంతక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో ఇప్పటివరకు అనేక అనాధ శవాలకు అంతక్రియలు నిర్వహించినట్లు ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సభ్యులు అక్బర్ బాషా, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.






