
పల్నాడు జిల్లా వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంపై జనసేన పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిర్లక్ష్యానికి ఉదాహరణగా నిలుస్తుందని, ఉపముఖ్యమంత్రికి తగిన గౌరవం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా కొనసాగుతున్న నేపథ్యంలో, కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి ఫోటోను అధికారిక ఫ్లెక్సీలో చేర్చకపోవడం సరికాదని జనసేన నాయకులు అన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో సమన్వయం పాటించాలని కోరారు.







