
వినుకొండ నుండి నూజెండ్లకు వెళ్లే రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటం, రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయం Village News ఛానల్లో ప్రసారం కావడంతో సమస్య అధికారుల దృష్టికి వెళ్లింది.ఈ అండర్‌పాస్‌లో నీరు నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. గుంతలు కనిపించక కొంతమంది వాహనదారులు జారి పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై స్పందించిన వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తక్షణమే సంబంధిత అధికారులను ఆదేశించి మంగళవారం మరమ్మత్తు పనులు ప్రారంభించారు. అండర్‌పాస్‌లో నిల్వైన నీటిని తొలగించడం, దెబ్బతిన్న రోడ్డును సరిచేయడం, గుంతలను పూడ్చడం వంటి పనులు చేపట్టారు.పనులు ప్రారంభం కావడంతో స్థానికులు మరియు వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.





