
వినుకొండ: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సూచించారు. మంగళవారం వినుకొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం అసత్యాలు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తూ ప్రజలకు మంచి పాలన అందిస్తోందని, అయితే ప్రతిపక్ష నాయకులకు అవి కనిపించడం లేదని అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చొరవతో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని చెప్పారు.
https://villagenews.in/bollaa-brahmanaidu-comments-on-tirupati-laddu-ghee-issue-vinukonda/
జగన్ కాలనీలో ట్రాన్సఫార్మర్ల ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలు అసత్యమని, నాలుగు ట్రాన్సఫార్మర్లలో మూడు గుంటూరు నుండి తీసుకువచ్చామని, మరొకటి షిఫ్టింగ్ చేశామని వివరించారు. వేల్పూరులో కోల్డ్ స్టోరేజ్‌కు గత ఏడాది నుండి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుండగా కరెంట్ లేదని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.పింఛన్లు పెంపు, ఉచిత బస్సు, తల్లికి వందనం వంటి పథకాలతో పాటు పోలవరం, అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.తిరుమల లడ్డూ కల్తీ అంశంపై కూడా స్పందిస్తూ, దానిపై నిజానిజాలు వెలికి తీయాలని, స్వామివారి ఔన్నత్యాన్ని కాపాడే చర్యలు తీసుకుంటామని చెప్పారు. యూరియా కొరత లేదని, రైతులకు పంటలు బాగా పండాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో దాసయ్య, పత్తి పూర్ణ, రోశయ్య, అంజిరెడ్డి, విశ్వనాథం, తిరుమల శెట్టి బాలయ్య, పెసలు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.







