
వినుకొండ, శుక్రవారం:వినుకొండలో కొందరు వైసీపీ నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు మెప్పుకోసం కూటమి ప్రభుత్వం, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని టిడిపి నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, పత్తి పూర్ణ, పల్లె మీసాల దాసయ్యలు హెచ్చరించారు.

చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు. సిట్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన అంశంపై అవగాహన లేకుండా కొందరు వైసీపీ నాయకులు మాట్లాడటం సరికాదన్నారు.

వినుకొండ పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రూ.210 కోట్ల తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారని, గత పాలనలో బ్రహ్మనాయుడు ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఆ పథకానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.ఎన్ఎస్పీకి చెందిన 22 ఎకరాల భూమిని మున్సిపాలిటీకి కేటాయించి అభివృద్ధి చేయాలనే నిర్ణయం గతంలో తీసుకున్నప్పటికీ, ఐదేళ్లలో ఒక్క పనీ జరగలేదని పేర్కొన్నారు. అప్పట్లో ప్రారంభించిన పనులను ఇప్పుడు తమవేనని వైసీపీ నాయకులు చెప్పడం తగదన్నారు.

వైసీపీ పాలనలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారాన్ని ఉపయోగించి వ్యాపార ప్రయోజనాలు పొందారని, కొనుగోలు చేసిన భూముల విలువ పెంచుకునేందుకు ప్రజాధనంతో రోడ్లు వేసుకున్నారని విమర్శించారు. మున్సిపల్ పరిపాలనలోనూ ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ప్రజల అభివృద్ధి దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిరాధార విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు బొంకూరి రోశయ్య, గంధం కోటేశ్వరరావు, గోవిందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.







