
వినుకొండ పట్టణంలోని మెయిన్ బజార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఒక పచారి దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో సమీప వ్యాపారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల ఇళ్లకు, ఇతర దుకాణాలకు చేరే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు.మహాశివరాత్రి సందర్భంగా పట్టణానికి చెందిన ఫైర్ ఇంజన్ కోటప్పకొండ తిరుణాల వద్ద విధుల్లో ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే కొంత సమయం గడిచినట్లు సమాచారం. ఈలోగా స్థానికులు, వ్యాపారులు కలిసి అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.

అగ్ని ప్రమాదం కారణంగా మెయిన్ బజార్ ప్రాంతంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. నష్టం వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.







