
వినుకొండ పట్టణ శివారు నరసరావుపేట రోడ్డులోని జ్యేష్ఠలక్ష్మి సమేత శనైశ్చర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. లోకకళ్యాణం కోసం దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల తరఫున ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా బాణలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో అన్నాభిషేకం చేయడంతో పాటు 108 రకాల అభిషేక ద్రవ్యాలతో విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శనం చేసుకున్నారు.దేవస్థానం అర్చకుడు మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు జానపాటి పరమేశ్వర కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు.







