
ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఫిబ్రవరి 19 గురువారం ఉదయం 10 గంటలకు వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలోని కళామందిర్ సెంటర్లో “రచ్చ బండ” కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి హాజరుకానున్నారు.పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బోయపాటి రామాంజనేయులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల విధానాన్ని మార్చడంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతోందని వారు విమర్శించారు. దీనివల్ల కార్మికులకు వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయని, పనుల ఆమోదంలో కూడా జాప్యం జరుగుతోందని తెలిపారు.కార్మికుల హక్కుల పరిరక్షణ, పెండింగ్ బకాయిల చెల్లింపులు, పూర్తి స్థాయి నిధుల విడుదల వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలు, ఉపాధి హామీ కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రెడ్డిబోయిన ప్రసన్నకుమార్, అసంఘటిత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు పిడుగు విజయకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటేరి పఠాన్ కరిముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.







