
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగపడే కీలక ఆరోగ్య సేవ అందుబాటులోకి రానుంది. వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉచిత డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది.
నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పరిధిలో PMNDP పథకం ద్వారా ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభ దశలో ఐదు డయాలిసిస్ యంత్రాలతో సేవలు అందించనున్నారు.
ఈనెల 21వ తేదీన వినుకొండ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు నియోజకవర్గ అభివృద్ధి అంశాలను వివరించారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులు డయాలిసిస్ కోసం గుంటూరు, ఒంగోలు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం వారంలోపే డయాలిసిస్ కేంద్రాన్ని మంజూరు చేయడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నియోజకవర్గంలోని ప్రజలకే కాకుండా పక్క జిల్లాలోని మరియు పరిసర మండలాలకు చెందిన కిడ్నీ రోగులు ఇప్పటివరకు వారానికి రెండు నుంచి మూడు సార్లు డయాలిసిస్ చికిత్స కోసం జిల్లాకేంద్రాలకు ప్రయాణించాల్సి వచ్చేది. దీంతో ప్రయాణ ఖర్చులు, సమయ నష్టం, శారీరక ఇబ్బందులు తీవ్రంగా ఉండేవి. ఇప్పుడు వినుకొండలోనే ఉచితంగా డయాలిసిస్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఆర్థిక భారం తగ్గనుంది.
ప్రభుత్వ ఆసుపత్రిలోనే సేవలు అందడం వల్ల ఆరోగ్య భద్రత పెరగడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చికిత్స పొందే అవకాశం ఉంటుంది. వృద్ధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఆర్థికంగా బలహీన వర్గాల రోగులు ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకోగలరు.త్వరలో సేవలు ప్రారంభండయాలిసిస్ కేంద్రం నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, వైద్య పరికరాల ఏర్పాటు చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
వినుకొండ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేసిన ఈ ప్రయత్నం కీలక మైలురాయిగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.








