మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి లాంచ్ రేవు వద్ద శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వినుకొండకు చెందిన యువకుడు నదిలో మునిగి మృతి చెందాడు.
వివరాల ప్రకారం, వినుకొండకు చెందిన గర్రె వెంకట ఈశ్వర్ సాత్విక్ (21) తుళ్లూరు పరిధిలోని VIT-AP విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE) నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతను మందడం ప్రాంతంలోని రామ్స్ PGలో నివాసం ఉంటున్నాడు.
శుక్రవారం తన స్నేహితులతో కలిసి రాయపూడి లాంచ్ రేవు వద్ద ఈతకు నదిలో దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక మత్స్యకారులు గాలింపు చేపట్టి అతని మృతదేహాన్ని బయటకు తీశారు.
ఈ ఘటనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.







