
పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేట మండలం పెట్లూరువారిపాలెం సమీపంలోని NSP కాలువలో ఈత కొట్టడానికి వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా కాట్రగుంట గ్రామానికి చెందిన మల్లెల అజయ్ కుమార్ (19) స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఆదివారం కాలువలోకి దిగిన సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతను అదుపు కోల్పోయి కొట్టుకుపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. కళాశాల వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నరసరావుపేట రూరల్ ఎస్ఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.






