
ప్రకాశం జిల్లా దర్శి ప్రాంత క్రీడాభిమానులకు సంతోషకరమైన వార్త వెలువడింది. దర్శి పట్టణంలోని శివరాజ్ నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.
ఇటీవల జిల్లా కలెక్టర్ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ స్టేడియానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
ఆ దిశగా సోమవారం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ శివకుమార్ స్టేడియం ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియం ఏర్పాట్లు, అభివృద్ధి అవకాశాలపై వారు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు. వీరితోపాటుగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు వంశీ, జిల్లా ACA అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు, కమిటీ సభ్యుడు బలరాం హాజరయ్యారు.
వీరితోపాటుగా దర్శి తహసీల్దార్ శ్రవణ్ కుమార్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మండల టిడిపి అధ్యక్షుడు మరెళ్ల వెంకటేశ్వర్లు, టౌన్ టిడిపి అధ్యక్షుడు పుల్లలచెరువు సత్యనారాయణ పాల్గొన్నారు.
స్టేడియం అభివృద్ధి పూర్తయితే దర్శి ప్రాంతంలో యువతకు క్రికెట్ క్రీడలో మరిన్ని అవకాశాలు కలుగుతాయని నాయకులు తెలిపారు.







