
పల్నాడు జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం చౌడేశ్వరి కాలనీకి చెందిన కాటూరి సుబ్బరత్నం (51) అనే మహిళ బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
సమాచారం మేరకు, సుబ్బరత్నం మిరపకాయల కోత పనుల కోసం నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లికి కూలీగా వెళ్లింది. అక్కడ రోజంతా పనులు పూర్తి చేసుకుని సాయంత్రం సమయంలో తిరిగి ఆటో వద్దకు వస్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.
తోటి కూలీలు వెంటనే స్పందించి ఆమెను పరిశీలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అనంతరం ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
సుబ్బరత్నం కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమెకు భర్తతో పాటు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి ఆమెే ప్రధాన ఆధారంగా ఉండటంతో ఈ ఘటన వారిని తీవ్ర విషాదంలో ముంచింది.
పిడుగుపాటు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






