
హైదరాబాద్: సోషల్ మీడియాలో వేగంగా పెరుగుతున్న సైబర్ మోసాలపై పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా “అమ్మాయిలతో చాట్ చేయండి”, “రాత్రి ఎప్పుడైనా మాట్లాడండి” అంటూ ఆకర్షించే యాప్ ప్రకటనలు ప్రమాదకరమని తెలిపారు. ఈ ప్రకటనల వెనుక సైబర్ నేరగాళ్లు ఉన్నారని, ప్రజలను మోసం చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి యాప్స్‌కు సంబంధించిన ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలు చూపిస్తూ యూజర్లను ఆకట్టుకునేలా ఈ యాడ్స్ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని, ఉచితంగా మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నారు.
ఈ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసిన వెంటనే, యూజర్‌కు తెలియకుండా ఫోన్లోని కాంటాక్ట్స్, ఫోటోలు, వీడియోలు వంటి వ్యక్తిగత సమాచారం మొత్తం యాప్ నిర్వాహకుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నకిలీ వీడియో కాల్స్ ద్వారా అసభ్య చాట్స్‌కి ప్రేరేపించి, వాటిని రికార్డు చేసి బాధితులను బెదిరించడం జరుగుతోంది.
తర్వాత ఆ వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ విధంగా అనేక మంది మోసపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది భయం, అపహాస్యం కారణంగా ఫిర్యాదు చేయకపోవడం వల్ల నేరగాళ్లు మరింతగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ దేవరకొండ–రష్మిక హల్దీ వేడుక ఫొటోలు వైరల్…https://villagenews.in/vijay-deverakonda-rashmika-haldi-photos-viral/
కాబట్టి తెలియని యాప్స్‌ను డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ప్రకటనలను పూర్తిగా దూరంగా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్లో ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా, అది అడిగే అనుమతులను ముందుగా పరిశీలించడం తప్పనిసరి అని తెలిపారు.
ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఈ రకమైన సైబర్ నేరాలను తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు






