
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో అక్రమంగా నిర్వహిస్తున్న కోడిపందేలపై పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం దొనకొండ ఎస్ఐ టి.త్యాగరాజు తన సిబ్బందితో కలిసి కోచర్లకోట, బోడపాడు గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కోడిపందేలు నిర్వహిస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోళ్లు, రూ.63,200 నగదు, 4 బైకులు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ త్యాగరాజు తెలిపారు. అక్రమంగా కోడిపందేలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







