
పల్నాడు జిల్లా గురజాల నగరపంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన భువనగిరి శ్రీనివాస్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం ఈపూరు మండలం చేజర్ల వద్ద ఉన్న మేజర్ కాలవలో లభించడం స్థానికంగా కలకలం రేపింది.కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, శ్రీనివాస్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.శనివారం ఉదయం చేజర్ల మేజర్ కాలవలో ఒక మృతదేహం తేలుతున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని శ్రీనివాస్గా గుర్తించారు.ఈ ఘటనపై మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా హత్య చేసి మృతదేహాన్ని కాలవలో పడవేసి ఉండవచ్చని ఆరోపిస్తున్నారు. పాత కక్షలు లేదా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరపాలని కోరుతున్నారు.పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






