
శుక్ర మౌఢ్యమి ముగియడంతో 2026 సంవత్సరానికి సంబంధించిన పెళ్లి ముహూర్తాలను పండితులు ప్రకటించారు. ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి కారణంగా శుభ ముహూర్తాలు లేవని తెలిపారు. ఫిబ్రవరి 18 నుంచి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి.పండితుల వివరాల ప్రకారం, ఫిబ్రవరి నెలలో 19, 20, 21, 24, 25, 26 తేదీలలో శుభ ముహూర్తాలు ఉన్నాయి. మార్చి నెలలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీలు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఏప్రిల్ నెలలో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు, మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 మరియు 21 నుంచి 29 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు.జూన్ నెలలో 1, 6, 7, 11 తేదీలలో కూడా శుభకార్యాలకు అనుకూల సమయం ఉందని చెప్పారు.అయితే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు చాతుర్మాస్యం, శూన్య మాసం కారణంగా ముహూర్తాలు ఉండవని పండితులు వెల్లడించారు. అనంతరం నవంబర్ నెలలో 21, 24, 25, 26 తేదీలు, డిసెంబర్ నెలలో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలు అనుకూలంగా ఉంటాయని తెలిపారు.పండితుల సూచనల ప్రకారం, పెళ్లి, నిశ్చితార్థం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాల కోసం తేదీ నిర్ణయించే ముందు తిథి, నక్షత్రం, లగ్నం, దోషాలు, వధూవరుల జాతకాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఒకే ముహూర్తం అందరికీ సరిపోదని వారు స్పష్టం చేస్తున్నారు.శుభ ముహూర్తాలు ప్రారంభమవడంతో ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, అలంకరణ వంటి సేవలకు డిమాండ్ పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ముందుగానే తేదీలు ఖరారు చేసుకొని ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.గతేడాది నవంబర్ నుంచి మౌఢ్యమి కారణంగా శుభకార్యాలు తగ్గిన నేపథ్యంలో, ఇప్పుడు వరుసగా ముహూర్తాలు రావడంతో వివాహాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశముందని పండితులు తెలిపారు.







