
వినుకొండ, ఫిబ్రవరి 17:వినుకొండలో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పర్మినెంట్ డాక్టర్లను నియమించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు పల్నాడు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
మంగళవారం ఉదయం కలెక్టర్ వినుకొండకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిపిఐ వినుకొండ పట్టణ సమితి నాయకులు కలిసి సమస్యలను వివరించారు. పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ, వినుకొండలో 100 పడకల ఆస్పత్రి కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం జరుగుతోందన్నారు.
గతంలో ఎన్ఎస్పి కాలనీలో సుమారు నాలుగున్నర ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. వెంటనే ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించాలని కోరారు.ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి 30 పడకల సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తోందని, సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో చిన్న సమస్యలకే నరసరావుపేట, గుంటూరు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని తెలిపారు.
వినుకొండ పరిసర ప్రాంతాల నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు ఈ ఆస్పత్రిపైనే ఆధారపడుతున్నారని చెప్పారు.విజయవాడ–రాయలసీమ ప్రధాన రహదారి కావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అత్యవసర వైద్యం అందించేందుకు సదుపాయాలు అవసరమని సిపిఐ నాయకులు కోరారు.వినతిపై స్పందించిన కలెక్టర్, ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి సమస్యలను అధ్యయనం చేస్తానని హామీ ఇచ్చారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో సిపిఐ నాయకులు చీరాల అంజయ్య, షేక్ మస్తాన్, కొబ్బరి బొండాల కిషోర్, షేక్ నజీర్, దుర్గారెడ్డి, తోట నరసింహారావు, బొట్టు శీను, నర్రా వెంకటరత్నం, సత్యానందం, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.







