
వినుకొండ పట్టణంలో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ వ్యాపారాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని బాధితులను మోసం చేసిన సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవల నరసరావుపేటకు చెందిన ఒక ప్రైవేట్ చిట్స్ సంస్థ, అలాగే ద్విచక్ర వాహనాల వ్యాపారం నిర్వహించిన వ్యక్తి బోర్డు తిప్పేయడంతో అనేక మంది పెట్టుబడిదారులు నష్టపోయినట్లు సమాచారం. అదే విధంగా వినుకొండలోని ఒక వ్యాపారి నమ్మకంతో కోట్ల రూపాయలు సేకరించి తిరిగి చెల్లించకుండా పరారైన ఘటన కూడా బాధితులను తీవ్రంగా దెబ్బతీసింది.
ముఖ్యంగా డాల్ వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు లక్షల రూపాయలు కోల్పోయినట్లు తెలుస్తోంది.తాజాగా పట్టణంలోని ఆన్లైన్ కేంద్రం నిర్వహిస్తున్న వ్యక్తి, తన వద్ద నుంచి డబ్బులు ఇచ్చిన 18 మందికి పైగా వ్యక్తులకు లాయర్ ద్వారా నోటీసులు పంపించిన ఘటన చర్చనీయాంశమైంది. తాను అప్పుల్లో ఉన్నానని, బాకీలు చెల్లించే పరిస్థితి లేదని తెలిపినట్లు బాధితులు చెబుతున్నారు.
ముందుగానే కంప్యూటర్లు, ప్రింటర్లు మరియు ఇతర సామగ్రిని విక్రయించి, ఇంటి సామాన్లను తరలించి రాత్రికి రాత్రే మకాం మార్చినట్లు సమాచారం.ఈ వ్యవహారంలో బ్యాంకులతో పాటు కొందరు సీనియర్ సిటిజన్లు కూడా నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్రతినెల వడ్డీ వస్తుందనే ఆశతో తమ పొదుపు మొత్తాలను ఇచ్చిన వృద్ధులు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోటీసులు అందుకున్న కొందరు బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
బాధితులు స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను కలిసి తమ సమస్యను వివరించినట్లు తెలిసింది. ఉద్దేశపూర్వకంగానే పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించి పరారయ్యాడని వారు ఆరోపిస్తున్నారు.స్థానికుల అభిప్రాయం ప్రకారం, మొదట నమ్మకం కలిగించేలా క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లిస్తూ, తర్వాత వ్యాపార నష్టాలు చూపిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించి పరారయ్యే విధానం కొందరు అవలంబిస్తున్నారని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా పరిశీలించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.







