
వినుకొండ : వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరును తీవ్రంగా విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆదివారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ..

వినుకొండ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని స్వయంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని నిధులు కోరుతూ చెప్పడం ఆయన వైఫల్యానికి నిదర్శనమని బ్రహ్మనాయుడు అన్నారు. ఇది వినుకొండలో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యేనే ఒప్పుకున్నట్టేనని విమర్శించారు.నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా కేవలం ప్రదర్శన రాజకీయాలు చేయడమే జరుగుతోందని, కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి స్టాల్స్ పరిశీలన సమయంలో హార్టికల్చర్ స్టాల్ వద్ద వినుకొండలో లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు వేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పగా, మాటలు కాకుండా పనులు చూపించాలని సీఎం వ్యాఖ్యానించడం ఎమ్మెల్యే పనితీరుపై ప్రభుత్వానికే అవగాహన ఉన్నట్టు చూపిస్తోందన్నారు.ఎన్ఎస్పి భూముల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు అవసరమని ఎమ్మెల్యే కోరడం ఆయన అవగాహన లోపాన్ని సూచిస్తోందని విమర్శించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇటీవల జరిగిన సీఎం పర్యటనలో ఆ ప్రాజెక్టు ప్రస్తావన కూడా చేయకపోవడం ప్రజలను నిరాశకు గురిచేసిందన్నారు.

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులు పొందిన వరికపుడిశాల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బొల్లాపల్లి మండల ప్రజలను మరోసారి మోసం చేసినట్టేనని ఆరోపించారు.వంద పడకల ఆసుపత్రికి తాను గతంలో అన్ని అనుమతులు సాధించానని, ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు కేటాయించి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.అలాగే రామలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి, ఘాట్ రోడ్డు మరియు గిరి ప్రదక్షిణ రోడ్ల అంశాలను కూడా సీఎంకు ఎమ్మెల్యే ప్రస్తావించకపోవడం ఆయన చిత్తశుద్ధిపై సందేహాలు కలిగిస్తోందని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు.







