
వినుకొండ: ప్రతి సంవత్సరం మార్చి నెలలో రెండో గురువారం అనగా రేపు 12 వ తేదీన ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
ఈ సందర్భంగా కిడ్నీ ఆరోగ్యంపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించే ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. రక్తపోటు నియంత్రణ, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి.
కిడ్నీ వ్యాధులు చాలా సందర్భాల్లో ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండానే అభివృద్ధి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. సమస్య తీవ్రత ఎక్కువైన తర్వాతే చాలా మంది గుర్తించే పరిస్థితి ఏర్పడుతోంది.
వినుకొండలోని సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు చెందిన కిడ్నీ నిపుణుడు డా. అన్నా మణికంఠ సురేష్ మాట్లాడుతూ షుగర్ మరియు రక్తపోటు ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. దీర్ఘకాలంగా షుగర్ లేదా బీపీ నియంత్రణలో లేకపోతే క్రమంగా కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.
కిడ్నీ రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలు, పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యలను ప్రారంభ దశలో గుర్తిస్తే సరైన చికిత్సతో పెద్ద సమస్యలను నివారించవచ్చన్నారు.
తగినంత నీరు తాగడం, షుగర్ మరియు బీపీ నియంత్రణలో ఉంచడం, డాక్టర్ సలహా లేకుండా నొప్పి నివారణ మందులు తరచుగా వాడకపోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినుకొండలోని సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.







