
స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వినుకొండలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజలు, వ్యాపారులకు కీలక సూచనలు చేశారు.120 మైక్రాన్స్ లోపు ఉన్న పలుచని ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కవర్లు వందల సంవత్సరాలు భూమిలోనే ఉండిపోయి కాలుష్యాన్ని పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వేడివేడి ఆహార పదార్థాలను ఇటువంటి ప్లాస్టిక్ కవర్లలో పెట్టడం వల్ల అవి కరిగి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెప్పారు. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం 25–30 సంవత్సరాల యువతలో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ఇందుకు ప్లాస్టిక్ వినియోగం ఒక కారణమని పేర్కొన్నారు.అందువల్ల ప్రజలందరూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు. ప్రత్యామ్నాయంగా పేపర్ బ్యాగులు, జ్యూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించాలని సూచించారు.వ్యాపారులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.







