
వినుకొండ: భారతదేశ చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన డిజిటల్ ‘స్వీయ గణన’ ప్రక్రియకు వినుకొండలో శ్రీకారం చుట్టారు. స్థానికంగా తన కార్యాలయంలో ప్రభుత్వం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గురువారం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2026 జనాభా గణనలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ విధానం ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.
ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు మొత్తం 15 రోజులపాటు స్వీయ గణనకు అవకాశం కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమయంలో ప్రజలు తమ వ్యక్తిగత మరియు కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులను ఉపయోగించి అధికారిక వెబ్ పోర్టల్లో లాగిన్ అయి, కుటుంబ సభ్యుల విద్య, ఉద్యోగం, నివాస పరిస్థితులు వంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.
ఈ కొత్త విధానం ద్వారా డేటా సేకరణ మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగిత రహిత విధానాన్ని ప్రోత్సహించడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు. సేకరించిన ఖచ్చితమైన గణాంకాల ఆధారంగా భవిష్యత్తులో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించడానికి ఇది కీలకంగా మారుతుందని వివరించారు.
వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్ణీత గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో డిజిటల్ అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు.








